ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు విశేష స్పందన వస్తున్న విషయం విదితమే. మార్చి 16 న విడుదలైన బాహుబలి 2 ట్రైలర్‌తో భారతీయ చలనచిత్ర రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోతున్నాయి. విడుదలైన 24 గంటల్లోనే ‘బాహుబలి 2’ ట్రైలర్ వ్యూస్ 5 కోట్లు దాటాయి. 96 గంటల్లో 8.5 కోట్లపైగా వ్యూస్ సాధించి అందనంత ఎత్తులో నిలిచింది. ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న సినిమా 'బాహుబలి ది కన్‌క్లూజన్'. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్.. రెండో భాగంపై అంచనాలను మరింత పెంచింది. రెండో భాగం.. కచ్చితంగా మొదటి భాగం సినిమాను మించి ఉంటుందని అభిమానుల్లో గట్టి నమ్మకం ఏర్పడింది. దీనికి తగ్గట్టుగా దర్శకదిగ్గజం రాజమౌళి కూడా.. ఈ సినిమాకు సంబంధించిన అంశాలను ఒక్కొక్కటిగా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. టీజర్, ట్రైలర్ విడుదల తర్వాత ఇప్పుడు పాటల పండగ మిగిలిపోయింది. అయితే ‘బాహుబలి-2’ ఆడియోను తెలుగు, తమిళం, మళయాలం, హిందీ భాషల్లో ఒకేసారి కాకుండా.. వరసగా నిర్వహించడానికి చిత్ర బృందం ప్లాన్ చేసినట్లు సమాచారం.
మొట్టమొదటగా తెలుగులో ఈ నెల 26న ‘బాహుబలి-2’ ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ను నిర్వహించనున్నారు. దీన్ని కనీవినీ ఎరగని రీతిలో జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. టాలీవుడ్ నుంచే కాకుండా బాలీవుడ్ నుంచి కూడా ప్రముఖులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కరణ్ జోహార్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. హిందీకి సంబంధించి ఈ సినిమా హక్కులను కరణ్‌కు చెందిన ‘ధర్మా ప్రొడక్షన్’ కొనుగోలు చేసింది. ఆడియో హక్కులను ప్రముఖ సంస్థ ‘లహరి’ సుమారుగా రూ.3 కోట్లు పెట్టి దక్కించుకున్నట్లు సమాచారం.
రామోజీ ఫిల్మ్ సిటీ ఎంట్రన్స్ కు సమీపంలో ఈ ఆడియో వేడుకను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఓ భారీ సెట్టింగును ఏర్పాటు చేయనున్నారు. ఆడియో ఫంక్షన్‌ను ఏ పట్టణంలో, ఎక్కడ జరపాలనే విషయంలో చాలా తర్జనభర్జన పడ్డ తర్వాత ఫైనల్‌గా ఈ వేదికను ఫిక్స్ చేశారట. మొదట.. రామోజీ ఫిల్మ్ సిటీలో బాహుబలి కోసం వేసిన మాహిష్మతి సెట్‌లో ఆడియో వేడుక జరపాలని భావించినా.. ఫిల్మ్ సిటీ నుంచి వేదిక వరకు అభిమానులు వెళ్లడానికి కష్టమవుతుందని ఎంట్రన్స్ సమీపానికి వేదికను మార్చినట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment